పటాన్ చెరులో భారీ భూదోపిడీకి స్కెచ్

క‌లం, మెద‌క్ బ్యూరో : పటాన్‌చెరు (Patancheru) పట్టణంలో వంద‌ల కోట్ల విలువైన ప్ర‌భుత్వ పాఠశాల స్థలంపై క‌బ్జా చేసేందుకు ప‌క్కాగా స్కెచ్ వేశారు అక్ర‌మార్కులు. ముంబై జాతీయ ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న వేళ సందేట్లో.. సండేమియా అన్న‌ట్లు రాత్రికి రాత్రి పాఠశాల భవనాన్ని కూల్చేశారు. కోర్టు కేసుల‌ను అస‌రాగా చేసుకోని సుమారు 300 వంద‌ల కోట్ల విలువైన ప్ర‌భుత్వస్థలం స్వాదీనం చేసుకోవాలనే ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే తాము చ‌దువుకున్న పాఠ‌శాల‌ను క‌బ్జాల నుంచి కాపాడుకోవ‌డానికి పూర్వ విద్యార్థులు న‌డుం బిగించారు.  వేలాది మందికి విద్య‌బుద్ధులు నేర్పిన పాఠ‌శాల ర‌క్షించ‌డ‌మే ల‌క్ష్యంగా పోరుబాట ప‌ట్టారు. పూర్వ విద్యార్థులు భూమి కాపాడుకోవ‌డానికి ఉద్య‌మానికి సిద్ధమవుతుంటే అధికార‌, ప్ర‌తిప‌క్ష నేతలు మాత్రం నోరు మెదకపోవడం సందేహ‌లకు తావిస్తోంది.

హైవే విస్త‌ర‌ణే అదునుగా క‌బ్జాకు ప్లాన్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ ముంబాయి జాతీయ ర‌హ‌దారిని అనుకొని 1953 నుంచి ప్ర‌భుత్వ‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్న‌ది. 2013 వ‌ర‌కు ఇక్క‌డ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను నిర్వహించారు. దాదాపు 60 ఏండ్లపాటు వేలాది మంది ప‌టాన్ చెరువు ప్రాంతానికి చెందిన విద్యార్ధులు ఇక్క‌డ విద్యాభ్యాసం చేశారు. 2013 త‌ర్వాత పాఠ‌శాల భ‌వ‌నం పూర్తి శిథిలావస్థకు చేరుకున్నది. త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ సాధ్యం కాద‌ని అధికారులు తేల్చ‌డంతో మైత్రి గ్రౌండ్స్ ప‌క్క‌న ఉన్న మ‌రో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోకి త‌ర‌లించారు. ముంబాయి హైవే‌కు అనుకొని స‌ర్వే నెంబ‌ర్ 428 లో రెండు ఎక‌రాల 18 గుంట‌ల‌ భూమి విలువ దాదాపుగా 300 కోట్లుకు పైగా ఉంటుంది. పాఠ‌శాల నిర్వ‌హ‌ణ లేక‌పోవ‌డంతోపాటు కోర్టు ప‌రిధిలో పాఠ‌శాల స్థలానికి సంబంధించిన కేసులు ఉండ‌టంతో కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్ర‌భుత్వ పాఠ‌శాల స్ధ‌లంపై క‌న్నేసిన వారు ముంబై జాతీయ ర‌హ‌దారి అరులేన్ల రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న స‌మ‌యంలో గుట్టుచ‌ప్పుడు కాకుండా ఈ నెల 8న పాఠశాల భవనాన్ని రాత్రికి రాత్రి కూల్చివేశారు. పాఠశాల ప్రహరీకి ముందు హైవేను అనుకొని దుకాణాలను తొలగించకుండా, ప్రహరీ నుంచి దూరంలో ఉన్న తరగతి గదులను కూల్చడం ప‌లు అనుమానలుకు తావిస్తుంది. నిజానికి జాతీయ రహదారి విస్తరణకు పాఠశాల అడ్డుగా లేకపోయినా ఎందుకు కూల్చివేశారో, ఎవరి ఆదేశాలతో కూల్చ‌రో తెలియ‌ని పరిస్థితి. సంఘ‌ట‌న జ‌రిగి వారం కావొస్తున్నా బాధ్యుల‌ను గుర్తించ‌పొవ‌డంలో మ‌త‌ల‌బు ఏమిటనే  ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. పాఠశాల ప్రహరీకి ముందు ఉన్న దుకాణాలను తొలగించకుండా, ప్రహరీ నుంచి దూరంలో ఉన్న తరగతి గదులను కూల్చడం ఉద్ధేశ‌పూర్వ‌కంగా జ‌రిగింద‌నే అరోప‌ణ‌లు విన్పిస్తున్నాయి.

అధికార ,ప్ర‌తిప‌క్ష పార్టీ మౌన‌మేలా …!

ఏ చిన్న అంశం దొరికిన అరోప‌ణ‌లు, ప్రత్యారోపణలు, స‌వాళ్లు చేసుకొనే పటాన్ చెరువు నియోజ‌క‌వ‌ర్గ అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నాయ‌కులు.. ప‌టాన్‌చెరు నడిబొడ్డున వంద‌ల కోట్ల ప్ర‌భుత్వ పాఠ‌శాలభవనం అక్ర‌మించుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ మౌనంగా ఉండ‌టంపై ప‌టాన్ చెరువు ప్రాంత ప్ర‌జ‌లు ప‌లు సందేహ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కూల్చివేతలు జ‌రిగి వారం రోజులు గడుస్తున్న కాంగ్రెస్ ,బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు క‌నీసం అటువైపు క‌న్నెత్తి కుడా చూడ‌లేదు. వంద‌ల కొట్ల విలువైన ప్ర‌భుత్వ పాఠ‌శాల స్ధ‌లం అక్ర‌మించే ప్ర‌య‌త్నం జ‌రిగినా స్ధానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి నుండి క‌నీస స్పంద‌న లేక‌పొవ‌డం ఏమిటని ప‌టాన్‌చెరు ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రోవైపు క‌బ్జాలపై స‌వాళ్లు విసిరే కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్ర‌భుత్వ పాఠ‌శాల విష‌యంలో గ‌ప్‌చుప్‌గా ఉన్నాడు. 50 ఏండ్లకుగా నిర్వ‌హ‌ణ జ‌రిగిన‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల భవనాన్ని కూల్చి, వందల కోట్ల విలువైన ప్ర‌భుత్వ అస్తిని ఆక్రమిస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మౌనంగా ఉండటమంటే అక్ర‌మ‌ణ‌దారుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చినట్టేనన్న చర్చ సాగుతోంది.

పాఠశాలను పరిశీలించిన రఘునందన్ రావు

మెద‌క్ ఎంపీ ర‌ఘ‌నంద‌న్ రావు పాఠ‌శాల‌ను కూల్చివేత‌ల అనంతరం క్షేత్ర‌స్ధాయిలో పరిశీలించారు. 1962 కి ముందే ఈ ప్రాంతంలో పాఠశాల ఉందని, భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఆధారాలు, సర్వే రిపోర్టులు ఉన్నాయని, ఈ భూమిపై వివాదం సృష్టించిన కొందరు కోర్టులన్నింటిలోనూ ఓడిపోయారని ఎంపీ రఘ‌నంద‌న్ అన్నారు. వంద‌ల కొట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని, అధికారులు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించారని ఎంపీ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే స్థానికులతో కలిసి భారీ ఆందోళన చేపడతామని ఎంపీ హెచ్చరించారు.

పాఠ‌శాల కోసం పూర్వ విద్యార్థుల ఉద్య‌మం

తాము చ‌దివిన పటాన్ చెరు ZPHS పాఠశాల పాత భవనాన్ని, కాంపౌండ్ వాల్ కూల్చి వేయడన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాఠశాల స్థలాన్ని రక్షించడ‌మే ల‌క్ష్యంగా పటాన్‌చెరు పాఠశాల పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక, తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పటాన్‌చెరు‌లోని ఫ్రీడం పార్కు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమొరాండం సమర్పించారు. సుమారు 50 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాలగా వెలుగొంది వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాల స్థలానికి ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమన్నారు. 13 ఏళ్ల క్రితం పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండ‌టంతో.. అవకాశం దొరికినప్పుడల్లా పాఠ‌శాల‌ స్థలాన్ని ఆక్రమించుకోవాలని కొందరు ప్రయత్నించడం పట్ల అగ్ర‌హం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు అనుమతితో నిర్మించిన ప్రహారీ గోడను రాత్రికి రాత్రి కూల్చివేయడం చాలా దారుణమని.. కాంపౌండ్ వాల్ కూలుస్తుంటే పాత భవనం నేలమట్టమైందని అధికారుల సైతం నివేదిక ఇవ్వడ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స‌రైనరీతిలో స్పందించి కోట్లాది రుపాయ‌ల స్ధ‌లంను కాపాడాలని కోరుతున్నారు. ప్ర‌భుత్వం బాధ్యత తీసుకుని సుప్రీం కోర్టులో సమర్థుడైన లాయర్‌ను నియమించి ఆ స్థలాన్ని ప్రైవేటు వ్య‌క్తుల చేతిలోకి వెళ్ల‌కుండా చేయ‌ల‌ని కొరుతున్నారు. ప్ర‌భుత్వం పాఠ‌శాల స్ధ‌లంను పూర్తిగా స్వాధీనం చేసుకోని… అదే స్థలంలో కొత్త‌గా హై స్కూల్ భవనాన్ని నిర్మించాల‌న్నారు. ఇప్పటికే పాఠ‌శాల స్ధ‌లంను ఆక్రమించి గుడారాలు ఏర్పాటు చేసుకున్న 9 గుంటల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నారు. తాజా వివాదాల నేపథ్యంలో అధికారులు పాఠశాలలో హెచ్చరిక బోర్డులను, గేటుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>