Mobile Popup Ad
Mobile Popup Ad

గుడి తెలంగాణలో.. గుడి మాన్యాలు ఆంధ్రాలో

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) సీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నప్పటికీ, ఆలయానికి సంబంధించిన భూములు ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాంతం పురుషోత్తంపట్నంలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆలయానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం నిలిచిపోతూ, భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పురుషోత్తంపట్నంలో సుమారు 890 ఎకరాల భూమి భద్రాచల రామాలయానికి చెందినదిగా ఉంది.

చరిత్ర ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామభక్తుడు సోమరాజు పురుషోత్తమ దాసు.. తనకు  సంతానం లేకపోవడంతో సుమారు 917 ఎకరాల భూమిని దేవాలయానికి దానం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భూముల ఆదాయం ఆలయ నిత్య సేవలు, బ్రహ్మోత్సవాల నిర్వహణకు వినియోగించాల్సిందిగా చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. 1878 నుంచి 2014 వరకు ఈ భూముల ద్వారా ఆలయానికి ఆదాయం అందినట్లు తెలుస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో భూములు సారవంతంగా ఉండి మంచి దిగుబడులు వచ్చేవని స్థానికులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం భూములపై వివాదాలు పెరిగి, కోర్టు కేసుల కారణంగా ఆదాయం నిలిచిపోయింది.

హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు దేవస్థానానికి అనుకూలంగా వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కావడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. 2025లో దేవస్థానం ఈవో భూముల పరిశీలనకు వెళ్లగా, ఆక్రమణదారుల నుంచి ప్రతిఘటన ఎదురవ్వడం అప్పట్లో కలకలం రేపింది. 2001లో గోదావరి వరదల నియంత్రణ కోసం కరకట్ట నిర్మాణంతో సుమారు 100 ఎకరాల భూమిని ప్రభుత్వం వివిధ అవసరాలకు వినియోగించుకుంది. మిగిలిన 800 ఎకరాలకు పైగా భూమి ప్రస్తుతం రైతులు, కబ్జాదారుల చేతుల్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026’ నేపథ్యంలో భద్రాచలం పరిసర ఐదు గ్రామాలు (కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, ఎటపాక, పురుషోత్తంపట్నం) మళ్లీ విలీన ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీలు ఏర్పడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. స్థానికులు భూములు ఆంధ్రాలోనే కొనసాగాలని కోరుకుంటుండగా, మరికొందరు తెలంగాణలో కలపాలని అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం (Bhadrachalam) రామాలయ భూముల భవిష్యత్‌పై ఇంకా స్పష్టత లేక పరిస్థితి ఉత్కంఠగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>