కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తనకున్న నమ్మకాన్ని చేతల్లో చూపిస్తూ పార్వతీపురం కలెక్టర్ (Parvatipuram Collector) ఎన్. ప్రభాకర రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేసిన తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్ రెడ్డిని, ఆయన పార్వతీపురంలోని దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో పదో తరగతిలో (Govt School) చేర్పించారు. జిల్లా అధికారి తన కుమారుడిని సర్కారు బడికి పంపడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కలెక్టర్ (Parvatipuram Collector) కుమారుడు తమ పాఠశాలలో చేరడం గర్వకారణమని, ఈ నిర్ణయంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ అన్నారు. కాగా, గతంలో ఇదే పాఠశాలలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పీఓ)గా పనిచేసిన కూర్మనాథ్ కూడా తన కుమారుడిని చదివించడం విశేషం. ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం ద్వారా ప్రభుత్వ విద్యా రంగ బలోపేతానికి తగిన గుర్తింపు దక్కినట్లైంది.

