కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విధులకు అనధికారికంగా దూరంగా ఉంటున్న వైద్యులపై (Doctors) ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దీర్ఘకాలంగా సెలవులు పెట్టకుండా, ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది వైద్యులను సర్వీసుల నుంచి డిస్మిస్ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) ప్రకటించారు. వీరితో పాటు మరో 34 మంది వైద్యులు సమర్పించిన రాజీనామాలను కూడా ప్రభుత్వం ఆమోదించిందని ఆయన తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ వైద్య సేవల్లో జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని ఆయన చెప్పారు.

