కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Sessions) సోమవారం ప్రారంభమయ్యాయి. ఆగస్టు 13 వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో తొలుత ఇటీవల మృతిచెందిన పార్లమెంటు సభ్యులకు లోక్ సభ సంతాపం తెలిపింది. ఇందులో భాగంగా నాదెండ్ల భాస్కరరావు మృతికి లోక్ సభ సభ్యులు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం సభ మొదలయింది. సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు తమ నిరసన గళం వినిపించాయి. సభ్యులు మాట్లాడటానికి సమయం ఇస్తామని, సభా మర్యాద పాటించాలని స్పీకర్ కోరారు.
మోదీ కీలక వ్యాఖ్యలు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు యువతలో ఎంతో ధైర్యాన్ని నింపాయని పేర్కొన్నారు. ఈ మార్పుల వల్ల యువత ప్రశంసనీయమైన అడుగులు వేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. ఈ సమావేశాలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని ఆశిస్తున్నానని చెప్పారు.
ఇటీవలే భారత అంతరిక్ష ప్రస్థానంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పుకొచ్చారు. ‘స్కైరూట్ ఏరోస్పేస్’ భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు. యువత సాహసాలు చేసి విజయాలు సాధిస్తున్నారని అభినందించారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం వచ్చిందని.. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని అన్నారు.

