కలం, వెబ్ డెస్క్: ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు సభలు కొనసాగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ప్రభుత్వ సిఫార్సుల మేరకు రెండు పార్లమెంట్ సమావేశం అయ్యేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమన్లు జారీ చేసినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై సభల్లో నిర్మాణాత్మక, అర్ధవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు వివరించారు.
కీలక బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం..
పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లులను ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి. ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు తీవ్రమైన కేసుల్లో వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే వారి పదవి పోతుంది. గత సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల ఆందోళనలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించారు. ఇటీవలే రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు కార్పొరేట్, విదేశీ విరాళాల నియంత్రణ బిల్లులను కూడా ఆమోదించబోతున్నట్లు చర్చ జరుగుతోంది.
నీట్ రద్దు, అయోధ్య అంశాల ప్రస్తావన…
నియోజకవర్గాల పునర్విభజన, నీట్ పరీక్ష రద్దు, సీబీఎస్ఈ మార్కుల దిద్దుబాట్లలో లోపాల వంటి అనేక అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్ధమయ్యాయి. అంతేగాకుండా అయోధ్య విరాళాల్లో చోరీ కూడా పెద్ద చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. కీలకమైన అంశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు అవసరమైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

