భక్తి మార్గంలో నడిస్తే.. ధర్మమే మనల్ని రక్షిస్తుంది: గణపతి సచ్చిదానంద

కలం, మంథని: భగవంతుడు సర్వాంతర్యామి అని.. అనేక రూపాలు, కోటానుకోట్ల పేర్లు ఉన్నాయని, ఏ విధంగా స్మరించినా భక్తులకు కనిపించి, వారి కోరికలు తీరుస్తారని అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (Ganapathi Sachchidananda Swamiji) అన్నారు. అయితే ఆ కోరికలు నిస్వార్థమైనవిగా, సహేతుకమైనవిగా ఉండాలని ప్రవచించారు.

ఆదివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు ధన్వాడ, మంథనిలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగించారు. భగవంతుడిని నిస్వార్థంగా స్మరిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తే జీవితంలో విజయం సాధించవచ్చని, మానవసేవే మాధవసేవగా భావించి అహింసా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.

ధన్వాడకు స్వామి రాక.. భక్తుల ఆనందం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు ఆదివారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విచ్చేశారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో చేరుకున్న స్వామీజీకి మంత్రి శ్రీధర్‌బాబు హెలిప్యాడ్‌ వద్ద స్వాగతం పలికి, తోడ్కొని వచ్చారు. అనంతరం మంత్రి నివాసానికి చేరుకున్న స్వామీజీ, ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోకకల్యాణార్థం నిర్వహించిన మహాపూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులను ఉద్దేశించి దివ్య ప్రవచనం చేశారు.

భగవంతుడికి జయం అక్కర్లేదు.. భక్తులకు విజయాన్ని ప్రసాదిస్తారు

భగవంతుడు ఎక్కడో లేడని, మన హృదయాల్లోనే కొలువై ఉంటాడని స్వామీజీ పేర్కొన్నారు. మనం భగవంతుడిని పూలతో పూజించి, నైవేద్యం సమర్పిస్తామని, భక్తితో సమర్పించిన నైవేద్యాన్ని భగవంతుడు సూక్ష్మరూపంలో ఆరగిస్తారని వివరించారు. భగవంతుడికి జయం అవసరం లేదని, ఆయనను విశ్వసించే భక్తులకు విజయాన్ని అందిస్తారని అన్నారు. భగవంతుడిని కుటుంబ సభ్యుడిగా భావించి, మనస్ఫూర్తిగా ఆరాధించాలని సూచించారు. కోరికలు కోరడంలోనూ నిస్వార్థం, సహేతుకత ఉండాలని హితవు పలికారు. మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోకూడదని, ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పారు.

బ్రిటిష్ కాలం నాటి తిరుపతి కథను వివరించిన స్వామీజీ

భగవంతుడి మహిమను వివరిస్తూ బ్రిటిష్‌ పాలన కాలంలో తిరుపతిలో జరిగిన ఒక కథను స్వామీజీ భక్తులకు వివరించారు. అప్పట్లో తిరుమల శ్రీవారికి నైవేద్యం సమర్పించే అర్చకులు, దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని వారే తింటున్నారని ఒక కలెక్టర్‌ అనుమానించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని నిరూపించాలనే సంకల్పంతో ప్రధాన అర్చకుడు, ఇతర అర్చకులతో కలిసి కలెక్టర్‌ సమక్షంలోనే నైవేద్యాన్ని సమర్పించారని చెప్పారు.

తెర లేకుండా పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని కలెక్టర్‌ ముందు ఉంచగా, ముందుగా సమర్పించిన ఆహారానికి, తర్వాత తీసుకొచ్చిన నైవేద్యానికి తేడా కనిపించిందని వివరించారు. ఈ ఘటనతో భగవంతుడి మహిమను గుర్తించిన కలెక్టర్‌ అర్చకులను అభినందించారని స్వామీజీ పేర్కొన్నారు. భగవంతుడి లీలలు అపారమని, ఆయన సర్వాంతర్యామి అని ఈ కథనం ద్వారా వివరించారు.

స్వామివారి రాకతో మంథని గడ్డ పులకించింది: శ్రీధర్‌బాబు

ధన్వాడలో కార్యక్రమం అనంతరం స్వామీజీ రోడ్డు మార్గంలో మంథనికి చేరుకున్నారు. అక్కడి శివకిరణ్‌ గార్డెన్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు దర్శనమిచ్చి, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వామివారి రాకతో మంథని ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు.

స్వామి వారు మంథని, ధన్వాడ ప్రాంతంలో అడుగుపెట్టడంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. “స్వామివారి దర్శన భాగ్యం లభించాలంటే ఎన్నో ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుంది. ఒక్క క్షణం, రెండు క్షణాలు స్వామివారి దివ్య ఆశీస్సులు పొందే అవకాశం లభించడం కూడా గొప్ప అదృష్టం. గత రెండుమూడేళ్లుగా మా అమ్మగారు జయశ్రీ, నా సతీమణి, కుటుంబ సభ్యులు స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు ఆశీర్వచనాలు అందించాలని కోరుకుంటున్నాం. ఇన్ని రోజుల నిరీక్షణకు నేడు ఫలితం దక్కింది” అని పేర్కొన్నారు.

ధన్వాడలో దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని స్థాపించుకున్న తర్వాత స్వామివారు అక్కడికి విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషమని మంత్రి అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు శుభాశీస్సులు ఆశీర్వచనాలు అందించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రముఖులు జిల్లా ఎస్పీ కలెక్టర్ ప్రజలు భక్తులు వేలాదిగా తరలివచ్చి పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వామివారి పాదాలకు నమస్కరించి, మంథని ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల కష్టాలు తొలగి.. సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల ప్రజలు, ముఖ్యంగా మంథని, ధన్వాడ ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజల కష్టాలు తొలగిపోయి, అందరూ బాగుండాలని, ప్రశాంతంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుందని, ఎన్ని కష్టాలు ఎదురైనా దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులతో వాటిని అధిగమించగలమనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఎల్లప్పుడుమంథని ప్రాంతం పై స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదం ఉంటాయని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ దంపతులు, మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ సతీమణి, జిల్లా కలెక్టర్‌ రామగుండం పోలీస్ కమిషనర్, స్థానిక ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>