కలం, వెబ్‌డెస్క్: బ్లాక్ కాఫీ (Black Coffee) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయంగా చెప్పుకోవచ్చు. బ్లాక్ కాఫీ అనేది ఎటువంటి పాలు, చక్కెర లేదా ఇతర రుచులు కలపకుండా, కేవలం వేడి నీరు, కాఫీ గింజల పొడితో మాత్రమే తయారుచేసే స్వచ్ఛమైన పానీయం. బ్లాక్ కాఫీ గుండె ఆరోగ్యానికి మంచిదని చాలా మంది పరిగణిస్తారు. అయితే గుండె ఆరోగ్యానికి నిజంగానే బ్లాక్ కాఫీ మంచిదా? బ్లాక్ కాఫీ వల్ల ఎటువంటి ప్రయోజనాలున్నాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్లాక్ కాఫీ గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుందట. ఈ పానీయంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు. అంతే కాకుండా బ్లాక్ కాఫీలో కేలరీలు ఉండవు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ (Caffeine) ఒక శక్తివంతమైన ఉత్సాహాన్నిచ్చే పదార్థం. ఇది మన శరీరానికి, మెదడుకు తక్షణ శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. బ్లాక్ కాఫీ తాత్కాలికంగా రక్తపోటు, గుండె వేగాన్ని పెంచుతుందట.
కెఫిన్ శరీరంలో నొరాడ్రినలిన్ (Noradrenaline), నొరెపినెఫ్రిన్ (Norepinephrine) వంటి హార్మోన్లను ప్రేరేపిస్తుందట. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేయడం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతాయని చెబుతున్నారు. అయితే ప్రతిరోజూ కాఫీ తాగే వారి శరీరం దీనికి అలవాటు పడిపోతుంది. కానీ, అప్పుడప్పుడు లేదా కొత్తగా తాగే వారిలో ఈ మార్పులు చాలా బలంగా కనిపిస్తాయని సూచిస్తున్నారు. బ్లాక్ కాఫీలో ఉండే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వేడి ఉత్పత్తిని పెంచి శక్తి వినియోగాన్ని ఎక్కువ చేస్తాయట. అందువల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
బ్లాక్ కాఫీతో బరువు నియంత్రణ
ప్రతిరోజు 2 నుంచి 3 కప్పుల బ్లాక్ కాఫీ తాగితే గుండెపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. మితంగా కాఫీ తాగడం వల్ల అధిక రక్తపోటు, గుండె వైఫల్యం, గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయట.
బ్లాక్ కాఫీ తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానిని తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
తీవ్ర రక్తపోటు ఉన్నవారికి ప్రమాదం
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం.. తీవ్రమైన అధిక రక్తపోటు (160/100 mm Hg లేదా అంతకంటే ఎక్కువ) ఉన్నవారు రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగితే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందట.
సురక్షితమైన పరిమితి
ఆరోగ్యంగా ఉండే పెద్దవారు రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు (సుమారు 3 నుండి 4 కప్పులు) కెఫిన్‌ను సురక్షితంగా తీసుకోవచ్చట.
కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం
ఫిల్టర్ చేయని కాఫీలో (ఉదాహరణకు ప్రెంచ్ ప్రెస్ పద్ధతిలో చేసేది) ‘కెఫెస్టాల్’, ‘కహ్వియోల్’ అనే సహజ నూనెలు ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి కాఫీని ఫిల్టర్ చేసి తాగడం మంచిది.
గుండె సమస్యలు, అధిక రక్తపోటు లేదా గర్భిణీలు కాఫీ తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు. మొత్తంగా, చక్కెర లేదా పాలు లేకుండా మితంగా బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండవచ్చు.

