కలం, వెబ్ డెస్క్ : లాటిన్ అమెరికా దేశమైన పనామాలో (Panama Earthquake) 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. పనామాలోని “లా పిటలోజా” సమీపంలో భూమికి 12.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఈ బలమైన షాక్ వల్ల పనామా రాజధాని పనామా సిటీతో పాటు పొరుగు దేశమైన కోస్టారికాలోనూ పలు సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించింది.
ఊగిపోయిన బిల్డింగ్లు .. జనం పరుగులు
ఈ భారీ ఘటనతో పనామాలోని పలు ప్రాంతాల్లో బిల్డింగ్లు ఊగిపోయాయి. అంతేకాదు పెనోనోమ్ నగరం సహా అనేక ప్రాంతాల్లో భవనాలు, చర్చి గోడలు పాక్షికంగా కూలిపోయాయి. భూకంపం తరవాత కూడా వరుసగా 40కి పైగా ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వారంతా ఒక్కసారిగా వీధుల్లోకి పరుగులు తీశారు. ఇక భూకంపం ధాటికి ఆరు ప్రావిన్సుల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విమానాశ్రయ సర్వీసులు, రవాణా వ్యవస్థ తాత్కాలికంగా నిలిచిపోగా, కొన్ని ప్రధాన రహదారులు దెబ్బతిన్నట్లు అధ్యక్షుడు హోసే రౌల్ ములినో వెల్లడించారు. అయితే, పనామా కాలువ కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం కలగలేదని అధికారులు తెలిపారు.

