జీవో 59 అప్లికేషన్లకు విముక్తి.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 500 గజాల్లోపు ఉన్న ఇళ్ల రెగ్యులరైజేషన్‌ (GO 59 regularisation)కు సంబంధించిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై శుక్రవారం సెక్రటేరియెట్‌లో అధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 59 దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 22ఏ సమస్యల పరిష్కారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో ఇదొక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. ‘‘జీవో 59 అమల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదు. నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి. గతంలో జారీ చేసిన కన్వేయన్స్ డీడ్‌లపై కూడా సమగ్ర సమీక్ష నిర్వహిస్తాం. సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22ఏ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశాం.

10 నుంచి 12 రకాల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జీవో 118, జీవో 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేశాం. ఇప్పుడు తాజాగా జీవో 59 దరఖాస్తుల పరిష్కారానికీ మెమో ఇచ్చాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి సంస్థల నుంచి ముందస్తు అనుమతులు పొంది 2ఏ జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతి ఇస్తున్నాం” అని వెల్లడించారు.

ఏంటీ జీవో 59?

ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు 2014 డిసెంబర్ 30న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 59 జారీ చేసింది. 2014 జూన్ 2కంటే ముందు నిర్మించుకున్న ఇళ్లను నిర్ణీత ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఆ తర్వాత ఆ అప్లికేషన్లు పెండింగ్‌లో పడ్డాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>