అమీన్‌పూర్‌లో రెచ్చిపోతున్న భూమాఫియా.. మాస్టర్ ప్లాన్ రోడ్డునే మింగేస్తున్నారు!

కలం మెదక్ బ్యూరో: కాదేది క‌బ్జాకు అన‌ర్హం అన్నట్టుగా త‌యారైంది సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ (Ameenpur) ప‌రిస్థితి. చెరువులు, ప్రభుత్వ భూముల‌ను మింగేసిన క‌బ్జాకోరులు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లోని రోడ్డును సైతం వ‌ద‌ల‌డం లేదు. ప్రభుత్వం త‌ల‌పెట్టినా మాస్టర్ ప్లాన్ రోడ్డు భూముల్లోనూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. భూమాఫియా నుంచి ప్రభుత్వ భూముల‌ను ర‌క్షించాల‌ని స్వయంగా అమీన్‌పూర్ స‌ర్కిల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ హైడ్రాను ఆశ్రయించడం గమనార్హం.

వేధిస్తోన్న ట్రాపిక్ సమస్య

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ హైద‌రాబాద్‌కి ద‌గ్గర‌గా ఉంటుంది. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఉన్న కిష్టారెడ్డిపేట్, సుల్తాన్‌పూర్, ఇల్లాపూర్, ఇల్లాపూర్ తండా, పటేల్‌గూడ, దయారా లాంటి గ్రామాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి మారాయి. ఆ తర్వాత నూతనంగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీన్‌పూర్ సర్కిల్-47 కిందకు వచ్చాయి. వంద‌లాది కొత్త కాల‌నీల్లో ల‌క్షలాది మంది నివాసం ఉంటున్నారు. జనాభా పెర‌గ‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్న చందానగర్ వద్ద జాతీయ రహదారిని కలుపుతూ శ్రీదేవి థియేటర్ మీదుగా అమీన్‌పూర్, ఐలాపూర్ తండా నుంచి నేరుగా సుల్తాన్‌పూర్ ఓఅర్అర్ జంక్షన్ వ‌ర‌కు అనుసంధానంగా చేయాల‌నే డిమాండ్ పెరుగుతున్నది.

ఇతర ప్రాంతాల కనెక్టివిటీకి ఇదే ప్రధానం

చందానగర్, మియాపూర్, BHEL ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు మియాపూర్-బొల్లారం ప్రధాన రహదారిపై ఆధారపడకుండా, అమీన్‌పూర్ మీదుగా బైపాస్‌లా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4కి నేరుగా చేరుకోవడానికి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో 150 అడుగుల రోడ్డు ప్రణాళిక‌లో ఉన్నది. మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగా అమీన్‌పూర్ ప్రాంతంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్లలో 150 అడుగుల ప్రతిపాదిత రోడ్లకు స్థలాన్ని వదిలారు. గచ్చిబౌలి/హైటెక్ సిటీ IT హబ్స్ నుంచి వయా ఓఆర్ఆర్ ద్వారా సుల్తాన్‌పూర్ మెడికల్ పార్క్, బొల్లారం IDA, బాచుపల్లి ఎడ్యుకేషనల్ హబ్‌లకు వేగవంతమైన కనెక్టివిటీకి ఈ రోడ్డు ఉప‌యోగ‌ప‌డుతుంది.

చందాన‌గ‌ర్ నుంచి సుల్తాన్ పూర్ ఎగ్జిట్ నెంబర్ 4 వరకు సుమారు 9 కిలోమీటర్లు దూరం ఉంటుంది. చందానగర్ నుంచి అమీన్‌పూర్ వరకు 5 కి.మీ మేర రూ. 45 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రోడ్డు పనులు ప్రసుత్తం కొన‌సాగుతున్నాయి. మిగతా నాలుగు కిలోమీటర్లు అమీన్ పూర్ పీఎన్అర్ కాల‌నీ, సాయి అంబిక కాలనీ నుంచి ఐలాపూర్ తండా మీదుగా సుల్తాన్ పూర్ ఎగ్జిట్ 4 వరకు నాలుగు కిలోమీటర్లు మంజూరు కావాల్సిఉంది. వంద‌లాది కొత్త కాల‌నీలకు ఈ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ద్వారా అమీన్‌పూర్ ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల‌కు రాకపోకలు సులభమవుతాయి.

మాస్టర్ ప్లాన్ రోడ్డు కబ్జా

అమీన్‌పూర్ సరిహద్దుల సాయి అంబికా కాల‌నీ వరకు ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్డు స్థలాలు బాగానే ఉన్నప్పటికీ, పక్కనే ఉన్న ఐలాపూర్ తండా వద్ద మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐలాపూర్ తండాకు భూముల‌పైన పెద్ద ఎత్తున వివాదాలున్నాయి. ఈ భూముల్లోనే స్థానిక నాయ‌కుల అండ‌దండాల‌తో పెద్ద ఎత్తున నోట‌రీల‌పైన ఇండ్ల నిర్మాణాలు జ‌రిగాయి. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణ కోసం కేటాయించినా ఆ భూములు అక్రమ‌ణ‌ల‌కు గురవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి, మాస్టర్‌ప్లాన్ ప్రణాళికలో ఉన్న రోడ్డు భూములను ద‌ర్జాగా ఆక్రమించేస్తున్నారు. 150 అడుగుల రోడ్డు వ‌ద‌ల‌కుండా నివాసాలు, ఖాళీ స్థలాల్లో ప్రహరీ నిర్మించేస్తున్నారు. నోట‌రీ మీద మాస్టర్ ప్లాన్ రోడ్డు భూములు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా ఇంటి నంబర్లు, కరెంట్, నీటి కనెక్షన్లు కూడా ఇచ్చేస్తుండటం గమనార్హం. భూ మాఫీయా అగ‌డాల‌తో ఐలాపూర్ తండాలో ప‌లు ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు చిన్నదిగా మారింది. ప్రసుత్తం రోడ్డు విస్తర‌ణ‌కు సిద్ధంగా ఉన్న ప్రాంతంలో ఆక్రమ‌ణ‌లు జ‌రుగుతుండ‌టం భవిష్యత్తులో విస్తర‌ణ‌కు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. మాస్టర్‌ప్లాన్‌లో వదిలిన భూములను సంరక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు (ORR) సుల్తాన్‌పూర్ ఎగ్జిట్-4 వరకు నిర్మించ తలపెట్టిన రేడియల్ రోడ్డు భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో మాస్టర్ ప్లాన్ రోడ్డు మూసుకుపోతున్నాయి.

హైడ్రాను ఆశ్రయించిన అమీన్‌పూర్ డీసీ

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేయ‌డం, మాస్టర్ ప్లాన్ రోడ్డు అక్రమించ‌డంతో అమీన్ స‌ర్కిల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ హైడ్రాను ఆశ్రయించారు. ఐలాపూర్, ఐలాపూర్ తండా ప్రాంతంలో వెలిసిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు గతంలోనే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆర్డర్ నోటీసులు జారీ చేసి కొన్ని కూల్చివేత చర్యలు చేపట్టినప్పటికీ, అక్రమార్కులు మళ్లీ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. దీంతో తండా పరిధిలోని ప్రభుత్వ భూముల్లో సర్వే నెంబర్లు 1 నుంచి 220 వ‌ర‌కు జరుగుతున్న అక్రమ కట్టడాలను తక్షణమే అడ్డుకుని, శాశ్వతంగా తొలగించేందుకు రంగంలోకి దిగాలని కోరుతూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్‌కు అమీన్‌పూర్ సర్కిల్-47 డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11, 12 తేదీల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టి, తదుపరి ఆక్రమణలు జరగకుండా ఖాళీ జాగాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయినా సర్వే నెంబర్ 1 నుండి 220 పరిధిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ​ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ సైతం అమీన్‌పూర్ మండల తహసీల్దార్‌కు ప్రతులు పంపించారు.

భవిష్యత్తులో భూసేకరణ కష్టమే..

వేగంగా విస్తరిస్తున్న అమీన్‌పూర్, సుల్తాన్‌పూర్ ప్రాంతాల్లో రాబోయే కాలంలో జనాభా, వాహనాల సంఖ్య విపరీతంగా పెరగనుంది. భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలకు ప్రతిపాదిత 150 అడుగుల రోడ్డు పూర్తయితే చందానగర్, మియాపూర్ మరియు నేషనల్ హైవే (NH-65) నుండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4కి వెళ్లే వాహనదారులకు సులువైన రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వాధికారులు, సంబంధిత శాఖ అధికారులు రోడ్డు భూములను కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో భూసేకరణ క్లిష్టంగా మారుతుందని అమీన్‌పూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>