కలం, స్పోర్ట్స్ : టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మరో కొత్త పాత్రలో కనిపించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు చిన్న విరామం తీసుకున్న సమయంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పట్నాలోని RBI ప్రాంతీయ కార్యాలయంలో ఆయన విధులకు హాజరైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రీడా కోటాలో ఇషాన్ కిషన్‌కు ఈ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. తాజాగా ఆయన RBIలో అధికారికంగా చేరారు.
పట్నా కార్యాలయానికి వచ్చిన సమయంలో పలువురు బ్యాంక్ ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. RBIలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్‌కు నెలకు సుమారు రూ.1.22 లక్షల నుంచి రూ.1.24 లక్షల వరకు జీతం ఉంటుందని సమాచారం. పీఎఫ్, ఇతర చెల్లింపులు తీసివేసిన తర్వాత చేతికి వచ్చే మొత్తం దాదాపు రూ.1.08 లక్షల నుంచి రూ.1.12 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.
ఇక క్రికెట్లో కూడా ఇషాన్ కిషన్ ఇటీవల మంచి పునరాగమనం చేశారు. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలతో మళ్లీ తన స్థానాన్ని సంపాదించుకున్నారు. అనూహ్యంగా భారత జట్టులోకి తిరిగి వచ్చిన ఆయన, 2026 టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుని టైటిల్ గెలిచిన భారత జట్టులో భాగమయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో పెద్దగా అవకాశాలు దక్కకపోయినా, జింబాబ్వే సిరీస్‌లో మంచి ప్రదర్శనతో తిరిగి తన సత్తా చాటారు.
ప్రస్తుతం భారత్ టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉండటంతో ఇషాన్ కిషన్‌కు కొంత విరామం లభించింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా ఆయన మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టనున్నారు. అంతకంటే ముందు ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహించనున్నారు. ఈ జట్టు తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్‌తో తలపడనుంది. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. క్రికెట్‌తో పాటు కొత్త బాధ్యతలను కూడా సమతుల్యం చేసుకుంటూ ఇషాన్ కిషన్ ముందుకు సాగుతున్నారు.

