కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు రైతాంగం నోట్లో మట్టి కొట్టే విధంగా రూపొందుతున్న డిండి లిఫ్టు ప్రాజెక్టు (Dindi Lift Project) ను వెంటనే రద్దు చేయాలని, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ ఈనెల 17న కల్వకుర్తిలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. పోరాడి సాధించుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటిని డిండి లిఫ్ట్ పేరుతో అక్రమంగా నల్గొండ జిల్లాకు తరలించే పనులను ఆపాలని డిమాండ్ చేస్తూ ఆయన మంగళవారం నాడుక ప్రకటన విడుదల చేశారు.
దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేయడంలో పాలకులు విఫలం చెందారని ఆయన విమర్శించారు. అపారమైన సాగుకు యోగ్యమైన భూములు ఉన్నప్పటికీ జలవనలు లేక బీడు భూములుగా మార్చిన చేతగాని నేతలు ఉన్నంతకాలం ప్రజలకు ఇబ్బందులు తప్పమన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులు వచ్చే కంటే ముందే నల్గొండ జిల్లాలోని రిజర్వాయర్లు సిద్ధం చేసి నికరజలాలు సాధించాలని లక్ష్యంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి ప్రయత్నిస్తున్నారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేయడానికి గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి, అయినప్పుడు దానిలో భాగంగా నిర్మిస్తున్న దిండి లిఫ్ట్ పనులు ఎట్లా కొనసాగిస్తారని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న మెతక వైఖరిని ప్రశ్నిస్తూ, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతాంగం, ప్రజలు కదిలి వచ్చి ఈనెల 17న కల్వకుర్తి తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన మహాధర్నాకు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

