కలం, నిర్మల్: బాల్యవివాహాలు, బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్బన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (Nirmal KGBV) న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. రాధిక హాజరై విద్యార్థినులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు.
న్యాయ సేవాధికార చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టంలోని నిబంధనలు, బాలల హక్కులు, రక్షణ చర్యలను వివరించారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాలలపై జరిగే వేధింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ (Nirmal KGBV) ప్రత్యేక అధికారి సుజాత, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

