వేసవి తాగునీటి సమస్యకు ప్రణాళిక సిద్ధం చేయండి: కూనంనేని

​కలం, ఖమ్మం బ్యూరో: ఎల్ నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి అతిథిగృహంలో ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సమీక్షలో కూనంనేని మాట్లాడుతూ.. ఎల్ నినో కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే చెరువులు, రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలను పొదుపుగా వినియోగించుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ​నియోజకవర్గ పరిధిలోని పాడైన బోర్లు, చేతిపంపులకు తక్షణమే మరమ్మతులు చేయించాలని, అవసరమైన చోట కొత్త బోర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు.

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూనంనేని స్పష్టం చేశారు. వ్యవసాయ సాగునీటి అవసరాలకు, అలాగే పశువుల దాహార్తికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కోరారు. ​ఈ సమీక్షా సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>