కొడుకుకు ‘భరత్’ అని పేరు పెట్టిన పాకిస్థాన్ మహిళ!

కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ వలసదారురాలు సీమా హైదర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్‌ (Seema Haider) పబ్జీ (PUBG) ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇందుకోసం సీమా హైదర్‌ తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీమా హైదర్.. తన ఆరో సంతానమైన కొడుకుకు ‘భరత్’ అనే పేరు పెట్టారు. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో జరిగిన నామకరణ వేడుకకు పెద్ద ఎత్తున కుటుంబీకులు, గ్రామస్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీమా హైదర్ మాట్లాడారు.

తాను హిందువుగా మారినందుకు చాలా గర్వంగా ఉందని సీమా హైదర్‌ చెప్పుకొచ్చారు. తన ఆరో కుమారుడి పేరు “భా”తో మొదలైతే మంచిదని పురోహితులు చెప్పారని.. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించి ‘భారత్’ అనే పేరును ఖరారు చేశానని వెల్లడించారు. దేశ గుర్తింపునకు ప్రతీక అయిన ‘భారత్’ కంటే అందమైన పేరు మరొకటి లేదని చెబుతూ ఆమె దేశభక్తిని చాటుకున్నారు. అంతేకాదు క్రికెట్‌లో భారత క్రికెట జట్టు అంటే ఇష్టమని.. భారత్ ఆడినప్పుడల్లా విజయం కోసం దేవుడిని ప్రార్థిస్తానని చెప్పారు. తాను పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తే లేదని ఆమె వెల్లడించారు. భారత్ లోనే ఉంటానని.. ఇదే తన శాశ్వత నివాసమని పేర్కొన్నారు. కాగా, సచిన్‌, సీమా దంపతులకు 2025 మార్చిలో కూతురు జన్మించింది. ప్రస్తుతం జన్మించిన బాబు సీమాకు ఆరో సంతానం. సచిన్‌తో ఆమెకు ఇది రెండో సంతానం. అయితే భవిష్యత్తులో ఇక తనకు పిల్లలు వద్దని.. ఆరుగురు పిల్లలు, వారి భవిష్యత్తుపైనే దృష్టి పెట్టినట్లు సీమా తెలిపారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమా తన కొడుకుకు ‘భారత్’ అనే పేరు పెట్టడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>