కలం, స్పోర్ట్స్: ఐసీసీ (ICC) త్రైమాసిక సమావేశాలు మే నెలలో అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ సమావేశంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డ్ ఛైర్మన్‌లు హాజరుకానున్నారు. కానీ ఈ సమావేశానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ (Mohsin Naqvi) రాక మాత్రం సందేహంగానే ఉంది. మొదట ఈ సమావేశాలను దోహాలో నిర్వహించాలని భావించారు అధికారులు. కానీ పశ్చిమ ఆసియాలోని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వీటిని భారత్‌కు బదిలీ చేసింది ఐసీసీ. మే 21న చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఆన్‌లైన్‌లో జరగనుండగా.. మే 30, 31 తేదీల్లో అహ్మదాబాద్‌లో బోర్డు సభ్యుల ప్రత్యక్ష సమావేశాన్ని ప్లాన్ చేశారు. అయితే భారత్-పాక్ మధ్య పెరుగుతున్న రాజకీయ, క్రికెట్ ఉద్రిక్తతల నేపథ్యంలో నఖ్వీ రాకపై అనుమానాలు నెలకొన్నాయి.
ఆయన పీసీబీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీసీసీఐతో సంబంధాలు పెద్దగా సవ్యంగా లేవన్న ప్రచారం ఉంది. ఇటీవల ఆసియా కప్ ముగింపు వేడుకల్లో చోటుచేసుకున్న ట్రోఫీ వివాదం ఈ టెన్షన్‌ను మరింత పెంచింది. భారత జట్టు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడాన్ని తప్పించుకుందనే వార్తలు చర్చకు దారితీశాయి. ఆ తర్వాత ట్రోఫీని నఖ్వీ దుబాయ్‌లోనే ఉంచారని, దాన్ని తిరిగి ఇవ్వాలని బీసీసీఐ ఐసీసీని ఆశ్రయించిందని సమాచారం. ఇలాంటి హైటెన్షన్ పరిస్థితుల్లో అహ్మదాబాద్ మీటింగ్‌కు నఖ్వీ హాజరవుతారా..? లేక వర్చువల్‌కే పరిమితమవుతారా..? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.

