పక్క చూపులు చూస్తే బయటికి వెళ్లండి.. నాయకులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్

కలం, కరీంనగర్ బ్యూరో : హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) పార్టీ నాయకులు, కార్యకర్తలకు చేసిన “ఎవరైనా పక్క చూపులు చూస్తే బయటికి వెళ్లండి” అనే వ్యాఖ్య రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.

సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల బలోపేతం, రైతుల సమస్యలు, యూరియా కొరత, సాగునీటి అంశాలపై కూడా ఎమ్మెల్యే చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, ద్వంద్వ వైఖరి ప్రదర్శించే వారు తమ పద్ధతులు మార్చుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే చేసిన హెచ్చరిక వెనుక రాజకీయ కారణాలపై హుజూరాబాద్ రాజకీయ వర్గాల్లో పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కొందరు బీఆర్ఎస్ నాయకులు పార్టీకి దూరమవడం, మరికొందరు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం నేపథ్యంలోనే బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో తనకు ఎదురైన రాజకీయ పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ హెచ్చరిక ఉండొచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరికొందరి అభిప్రాయం ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్లే అవకాశాలపై పార్టీ నాయకత్వంలో ఆందోళన ఉండవచ్చని చెబుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఒకే పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన నాయకుల సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఈ చర్చకు కారణమవుతోంది. హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన హెచ్చరిక స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>