ప్రతి సొసైటీకి కొత్త పంట రుణాల కింద రూ.10 లక్షలు : చాహత్‌ బాజ్‌పాయి

కలం, హనుమకొండ : ప్రతి సహకార సంఘానికి కొత్త పంట రుణాల కింద రూ.10 లక్షలు కేటాయించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి (Chahat Bajpai) ప్రకటించారు. మంగళవారం హనుమకొండలో నిర్వహించిన డీసీసీబీ మహా జనసభ సమావేశంలో బ్యాంకు ఆర్థిక ప్రగతి, రుణ సదుపాయాల విస్తరణ, బకాయిల వసూళ్లు తదితర అంశాలపై చర్చించారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.10.23 కోట్ల నికర లాభాన్ని సాధించగా, సభ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్‌) రూ.1.53 కోట్ల డివిడెండ్‌ ప్రకటించారు. సమావేశంలో వార్షిక ఆర్థిక నివేదికలు, బ్యాలెన్స్‌ షీట్‌, లాభనష్టాల ఖాతా, ఆడిట్‌ సర్టిఫికేషన్‌, నికర లాభాల వినియోగం, ఆడిటర్ల నియామకం తదితర అంశాలను పరిశీలించారు.

దీర్ఘకాలిక రుణాలకు అవకాశం

50 శాతానికి పైగా రుణాల రికవరీ సాధించిన అర్హతగల సొసైటీలకు రూ.50 లక్షల వరకు, మిగిలిన ఏ, బీ కేటగిరీ ఆడిట్‌ ర్యాంకింగ్‌ సొసైటీలకు రూ.30 లక్షల వరకు దీర్ఘకాలిక రుణాలు అందించే అంశాన్ని కలెక్టర్‌ చాహత్ బాజ్‌పాయి వెల్లడించారు. రుణ బకాయిదారులకు ఉపశమనం కల్పించేందుకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకం గడువును 2027 మార్చి 31 వరకు పొడిగించినట్లు చెప్పారు. అలాగే, బ్యాంకు శాఖల విస్తరణలో భాగంగా భూపాలపల్లి, ములుగు, ఘనపూర్‌ శాఖల భవన నిర్మాణాలకు స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, హనుమకొండ జిల్లా సహకార అధికారి బి.మోహన్‌, బ్యాంకు డీఆర్‌/ఓఎస్‌డీ వెంకటేశ్వర్లు, జనరల్‌ మేనేజర్‌ ఉషాశ్రీ, సీఈవో మహ్మద్‌ వజీర్‌ సుల్తాన్‌, వరంగల్‌ జిల్లా సహకార అధికారి నీరజ, నాబార్డ్‌ డీడీఎం చంద్రశేఖర్‌, భూపాలపల్లి డీసీఓ వల్యా నాయక్‌, మహబూబాబాద్‌ డీసీఓ సర్దార్‌ సింగ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>