ప్రేమ పేరిట మోసం.. న్యాయం కోసం యువ‌తి పోరాటం!

కలం, ఖమ్మం బ్యూరో: ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని యువ‌తిని శారీరకంగా వాడుకోవ‌డ‌మే కాక‌, బాధితురాలిపై భౌతిక దాడికి పాల్ప‌డిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) మండల పరిధిలో చోటు చేసుకుంది. దీంతో న్యాయం కోసం బాధిత యువ‌తి ప్రియుడి ఇంటి ఎదుట నిర‌స‌న‌కు దిగింది. త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఇక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేప‌ట్టింది.

​రాజాపురం గ్రామానికి చెందిన ఓ యువ‌తి, కోడిపుంజుల గ్రామానికి చెందిన భూక్యా అభి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువ‌తిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన అభి, ఆదివారం రాత్రి ఆమెను పుల్లయ్యగూడెం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువ‌తి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఆమెను తీవ్రంగా కొట్టి దౌర్జన్యానికి దిగాడు. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అయితే వాళ్లు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకునే లోపే అభి అక్కడి నుంచి పరారయ్యాడు.

అభి దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ యువ‌తి కుటుంబ‌స‌భ్యుల ఎదుట క‌న్నీరు మున్నీరుగా విల‌పించింది. తనకు జరిగిన అన్యాయంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ, నేరుగా నిందితుడి ఇంటికి చేరుకుంది. “నన్ను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి ఈ స్థితికి తెచ్చాడు.. నాకు అభినే కావాలి, నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు” అంటూ కన్నీళ్లతోనే నిందితుడి ఇంటి ముందే భీష్మించుకు కూర్చుంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలవడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>