కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushbu Gupta) అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి, రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు. ప్రజావాణిలో 93 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.
ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి, సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువస్తున్నందున, వాటి పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
‘వ్యసన ముక్త్ భారత్’ కోసం బ్రహ్మకుమారీల ప్రతిజ్ఞ
ప్రజావాణి కార్యక్రమం అనంతరం బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వ్యసన ముక్త్ భారత్’ ప్రచారంలో భాగంగా జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాట్లాడుతూ, వ్యసన ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలనే లక్ష్యంతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 6 నుంచి 20వ తేదీ వరకు దాది ప్రకాశ్‌మణి స్మారకార్థం రక్తదాన శిబిరాలు, వ్యసన విముక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలతో పాటు మొబైల్ ఫోన్, స్క్రీన్ వినియోగం, ప్రతికూల ఆలోచనలు, పనులను వాయిదా వేయడం వంటి అలవాట్లు కూడా వ్యసనాలుగా మారుతున్నాయని తెలిపారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ సానుకూల ఆలోచనలు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వ్యసన ముక్త్ మహబూబ్‌నగర్, వ్యసన ముక్త్ తెలంగాణ, వ్యసన ముక్త్ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సెన్సస్ వివరాలు ఈ నెల 20లోగా అందించాలి
అనంతరం జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. జిల్లాలో సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టేజ్-1 విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. తదుపరి దశ సెన్సస్ ప్రక్రియలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్ కోరకు అవసరమైన సమాచారాన్ని శాఖల వారీగా వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో సేకరిస్తున్నట్లు చెప్పారు.
31 సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్లు తమ పరిధిలోని వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి ఈ నెల 20లోగా జిల్లా ప్రణాళిక శాఖకు పంపించాలని ఆదేశించారు. సెన్సస్‌కు సంబంధించిన రికార్డులు, ఫైళ్లను భద్రంగా ఉంచాలని సూచించారు. సెన్సస్ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డి.ఆర్.డి.ఓ. నర్సింహులు, జిల్లా ప్రణాళిక శాఖ ఇంచార్జి అధికారి బి. నర్సింహులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

