కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కళాశాలలో గురువారం జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవ(NSS Foundation Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ జాతీయ యువజన అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకుడు, సామాజిక సేవకుడు కొండ రవి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండ రవి యాదవ్ మాట్లాడుతూ యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా నిస్వార్థ సేవా భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. అనంతరం ఆయన ఆలపించిన దేశభక్తి, జానపద, సామాజిక గేయాలు విద్యార్థులు, వాలంటీర్లను ఆకట్టుకున్నాయి.
రిటైర్డ్ తహసిల్దార్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల దశ నుంచే సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలతో పాటు చదువుల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సమాజ సేవలో విశేష సేవలందించిన కొండ రవి యాదవ్‌ను కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, అధికారులు శాలువా, పూలబొకేలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు వి. రవీందర్ రెడ్డి, బి. సంపత్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

