కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో (Telangana) పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. రాష్ట్రంలో ఇంధన కొరత ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,325 పెట్రోల్ బంకులు ఉండగా, ఈ రోజు ఉదయానికి కేవలం 106 బంకులలో మాత్రమే స్టాక్ లేదని గణాంకాలతో వివరించారు. కొన్ని చోట్ల సరఫరాలో అంతరాయం కలగడానికి కారణం పెట్రోల్ బంకుల యజమానులు సక్రమంగా ఇండెంట్ పెట్టకపోవడం, సకాలంలో బిల్లులు చెల్లింపులు చేయకపోవడమేనని మంత్రి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక కారణాల వల్ల కొన్ని పంపుల్లో నిల్వలు లేవు తప్ప, రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇంధనం కొరతపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. ఒకవేళ ఉంటే కేంద్రమే స్వయంగా చెబుతుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ట్వీట్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

