కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) కొరత (Telangana Fuel Shortage) లేనే లేదని, షార్టేజీ ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో అవసరాలకు, డిమాండ్‌కు తగినంతగా స్టాక్ అందుబాటులో ఉందని పేర్కొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నమని, రీజినల్ ఆఫీసుల నుంచి ఎప్పటికప్పుడు గణాంకాలను, తాజా స్టేటస్‌ను తెప్పించుకుంటున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు ఆయిల్ కంపెనీల స్టేట్ కో-ఆర్డినేటర్ ఆ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. ఈ నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్ సరఫరాలో 14.2%, డీజిల్ సరఫరాలో 15.7% వృద్ధి నమోదైనట్లు వివరించారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయని తెలిపారు. వినియోగదారులు ఇప్పుడు ముందస్తు బుకింగ్స్ చేయటం లేదన్నారు.
తెలంగాణలో ఈ నెలలో ఇప్పటికే మొత్తం 20.06 లక్షల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేశామని తెలిపారు. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్, డెలివరీలలో అక్రమాలను అరికట్టేందుకే ఓటీపీ సిస్టమ్‌ను విస్తృతం చేసినట్లు తెలిపారు. ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదా పెట్రోలు, డీజిల్ షార్టేజీ ఉన్నట్లు వచ్చే వార్తలను నమ్మి హైరానా పడొద్దని పేర్కొన్నారు.
Read Also: చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు.. వయసు పెరిగినా చురుగ్గా ఉంచే ‘మైక్రో హాబిట్స్’
Follow Us On: WhatsApp

