నాగార్జునసాగర్ నీటి తరలింపు యత్నాలను అడ్డుకోవాలి: బీఆర్‌ఎస్‌

కలం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) జలాశయం నుంచి భారీ టన్నెల్ (Tunnel) ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు (BRS Leaders ) ఆందోళన చేపట్టారు. నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి వద్ద మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్, కడారి అంజయ్య యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అమరజీవి జలపథకం పేరుతో నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం రూ. 1,200 కోట్లతో భారీ టన్నెల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు సిద్ధమవుతున్నా తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి తెలంగాణ ప్రయోజనాలను విస్మరిస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్ర నీటి హక్కులకు భంగం కలుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం తగదని, తక్షణమే ఈ ప్రాజెక్టు ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>