కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో వందేమాతరం ఫౌండేషన్, మహబూబ్‌నగర్ ఫస్ట్ సంయుక్తంగా నిర్వహించిన NMMS స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల, హైస్కూల్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 900 మంది విద్యార్థులు హాజరయ్యారు. పట్టణ సీఐలు అప్పయ్య, ఎజాజుద్దీన్ పరిశీలించారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ద్వారా 60 మంది విద్యార్థులను NMMS స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించారు. ఈ సంవత్సరం పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.
మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ సమన్వయకర్త రవీందర్ రెడ్డి వివరాలు తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 120 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ స్థాయిలో నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు గొల్లపల్లిలోని లలితాంబికా తపోవనంలో పది రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.
250 మంది విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా..
స్క్రీనింగ్ పరీక్షలో ప్రతిభ చూపిన మరో 250 మంది విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు గుండా మనోహర్, రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రత్యక్ష శిక్షణతో పాటు ఆన్‌లైన్ తరగతుల ద్వారా మరింత మంది విద్యార్థులకు నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించడం ద్వారా ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌ల సాధనకు అవసరమైన ప్రోత్సాహం కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరిస్తూ, వారు ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. కార్పొరేటర్ రఘు తదితరులు పాల్గొన్నారు.

