కలం, కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ విషప్రచారం చేస్తున్నాయని, సర్ పై గందరగోళం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర (Bonthala Kalyan Chandra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కాంగ్రెస్ , సీజేపీ ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారత ఎన్నికల సంఘం బీజేపీ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఓటర్ల జాబితాను పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో నకిలీ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే సర్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
సర్‌పై అనవసర రాద్ధాంతం చేయడమే లక్ష్యంగా వ్యవహారాలు చేస్తున్న కాంగ్రెస్, సీజేపీ వైఖరి దారుణమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నకిలీ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించవద్దా అని ఆయన ప్రశ్నించారు.ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఇదేమీ మొదటి సారి కాదని, భారత ఎన్నికల సంఘం గతంలో 1952, 1957, 1961, 1965–66, 1983–84, 1987–89, 1992–95 2002–2004 లలో ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను నిర్వహించిందని గుర్తు చేశారు. పూర్తి పారదర్శకతతో జరుగుతున్న సర్ ప్రక్రియపై , చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలంతా గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, ఓదెలు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

