కలం, ఖమ్మం బ్యూరో : అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సిబ్బంది మెరుపు వేగంతో స్పందించేలా సన్నద్ధంగా ఉండాలని, విధుల పట్ల ఎలాంటి అలసత్వం సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohit Raj) హెచ్చరించారు. మంగళవారం ఓఎస్డీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, ఆయుధ కర్మాగారం, (ఆమ్స్ డిపో) బ్యారక్స్‌ను విస్తృతంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ (SP Rohit Raj) మాట్లాడుతూ.. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ వంటి అత్యవసర రక్షణ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాల ఛేదనలో కీలకంగా వ్యవహరించే జాగిలాలకు క్రమం తప్పకుండా శిక్షణ అందించాలని ఆయన ఆదేశించారు.
ఆయుధాల నిర్వహణ, మరమ్మతులపై అధికారులకు పలు సూచనలు చేస్తూనే, విధి నిర్వహణలో సిబ్బందికి శారీరక దారుఢ్యం అత్యంత ప్రధానమని వ్యాయామం చేయాల్సిందిగా కోరారు. బ్యారక్స్‌లో తాగునీరు, పరిశుభ్రత, మెరుగైన వసతులు కల్పించాలని, అవసరమైన ప్రాంతాల్లో తక్షణమే మరమ్మతులు చేపట్టి సిబ్బందికి అనుకూలమైన పని వాతావరణం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

