కలం, ఆదిలాబాద్ : ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ఆధార్‌కు సంబంధించిన సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ప్రత్యేక జిల్లా ఆధార్ సేవా కేంద్రాన్ని (Aadhaar Seva Kendra) ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆధార్ సేవల కోసం ప్రజలు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే అవసరమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కొత్తగా ఆధార్ నమోదు, ఆధార్‌లోని వివరాల సవరణ, చిరునామా తదితర వివరాల నవీకరణ, బయోమెట్రిక్ అప్‌డేట్ వంటి సేవలను ఈ కేంద్రంలో పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం రవి, మేనేజర్ శ్రవణ్, శ్రీనివాస్, హరినాథ్, మాజర్ హుస్సేన్, కుందన్ తదితరులు పాల్గొన్నారు.

