కలం, మెదక్ బ్యూరో: సమయానికి విద్యుత్ సరఫరా చేయడం లేదని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా అందోల్ (Andole) మండలం అన్నాసాగర్ 11 కేవీ సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నాకు దిగారు. జోగిపేట, మాసానిపల్లి గ్రామాల రైతులు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతులు సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి, విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ అరకొరగా ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులకు మేలు చేయడంపైనే దృష్టి పెట్టిందని, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.
అన్నాసాగర్ సబ్ స్టేషన్ వద్ద రైతులు చేపట్టిన ఆందోళనతో జోగిపేట – సంగారెడ్డి ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రైతులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపిచారు. అనంతరం రైతులు విద్యుత్ శాఖ డీఈఈ శ్రీనివాస్‌ను కలిశారు. కరెంట్ సమస్యలు తలెత్తకుండా నిరంతర సరఫరా అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

