బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి జీవిత ఖైదు

కలం, నిజామాబాద్ బ్యూరో: మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో పాటు, ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించిన నిందితుడికి నిజామాబాద్ (Nizamabad) పోక్సో ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధిత బాలికకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.

కేసు వివరాలు

బాధిత బాలిక 12 సంవత్సరాల వయస్సులో ఐదో తరగతి చదువుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక కిరాణా దుకాణానికి వెళ్తున్న సమయంలో నిందితుడు ఆమె చేయి పట్టుకుని బలవంతంగా నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయపడి ఎవరికీ చెప్పలేదు. అనంతరం మూడు, నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి బాలికను సమీపంలోని పాడుబడిన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నాలుగు, ఐదు రోజుల వ్యవధిలో మరోసారి ఇదే విధంగా నేరానికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో 03-10-2021న బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. వైద్య పరీక్షల్లో బాలిక సుమారు ఆరు నెలల గర్భిణి అని వెల్లడైంది. దీంతో తల్లి వివరాలు అడిగి తెలుసుకోగా, నిందితుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి తల్లి 15-10-2021న నిజామాబాద్ టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రైమ్ నంబర్ 329/2021 కింద ఐపీసీ 376 AB, 506, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా బాధిత బాలిక వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

న్యాయస్థానం తీర్పు

ఈ కేసును విచారించిన నిజామాబాద్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి దుర్గాప్రసాద్, PSC No.65/2022 కేసులో 19-11-2026న నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్షలు విధించారు. పలు సెక్షన్ల కింద యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. పోక్సో చట్టంలోని సెక్షన్లు 5(L), 5(J)(ii), 5(M) రెడ్ విత్ సెక్షన్ 6 కింద ప్రతి సెక్షన్‌కు 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. ఈ శిక్షలన్నింటినీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా బాధిత బాలికకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా పోలీసులు నిరంతరం కృషి చేశారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం, సాక్షులను సకాలంలో సమన్వయం చేసి కోర్టుకు హాజరుపరచడం వంటి అంశాల్లో సంబంధిత పోలీసు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపించడంతో నిందితుడికి తగిన శిక్ష పడింది.  ఈ కేసులో మొదటి నుంచి చివరి వరకు నిర్విరామంగా కృషి చేసి, సాక్షులను సమన్వయం చేస్తూ కోర్టు విచారణకు హాజరుపరిచి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>