420 హామీలు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ధ్వజం

కలం, నకిరేకల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలన ప్రజలకు తీరని అన్యాయం చేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ నకిరేకల్‌ (Nakrekal) నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన(BRS Protest) కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేపట్టాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎండగడుతూ నాయకులు 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. 1000 రోజుల పాలనలో రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు నెరవేర్చని హామీలను ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.

100 పడకల ఆసుపత్రిపై చిరుమర్తి ఫైర్‌

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నకిరేకల్‌ పర్యటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయ్యాక దానిని ప్రారంభించడం మినహా కాంగ్రెస్‌ ప్రభుత్వం నకిరేకల్‌కు కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్‌ మంజూరు చేసిన పనులకు వచ్చి ప్రారంభోత్సవాలు చేయడం గొప్ప విషయం కాదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో నకిరేకల్‌ నియోజకవర్గానికి కొత్తగా ఎన్ని అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరు చేసిందో, ఎంత మేర నిధులు కేటాయించిందో సమాధానం చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి నకిరేకల్‌కు రావాలని డిమాండ్‌ చేశారు.

హామీలు నెరవేర్చే వరకు పోరాటం

రైతులు, నిరుద్యోగులు, పేదల సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్‌ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ బీఆర్‌ఎస్‌ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>