కలం, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా పర్యటనలో 2018లో చోటు చేసుకున్న సాండ్‌పేపర్ బాల్ టాంపరింగ్ ఉదంతంపై మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) సంచలన విషయాలు వెల్లడించారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం స్పందించింది. గతంలో జరిగిన విచారణ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని, అప్పట్లో అందిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నివేదిక ఇచ్చామని స్పష్టం చేసింది. త్వరలో రాబోతున్న తన ఆత్మకథ ‘సబ్ర్’ పుస్తకంలో ఖవాజా ఈ అంశాలను పొందుపరిచారు. కేప్ టౌన్ టెస్టులోనే కాకుండా అంతకుముందు టెస్టులో కూడా సాండ్‌పేపర్ ఉపయోగించారని, ఈ విషయం జట్టులోని ఆటగాళ్లతో పాటు స్టాఫ్ అందరికీ ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల తర్వాత అయినా నిజం బయటకు వస్తుందని తాను భావించానని ఖవాజా తెలిపారు. అప్పట్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చాక స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు, కెమరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. స్మిత్, వార్నర్‌ల కెప్టెన్సీ బాధ్యతలపై కూడా పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన సిఏ, ఎనిమిదేళ్లుగా విస్తృతంగా మీడియా కవరేజ్ వచ్చినప్పటికీ, తమ విచారణ ప్రక్రియపై పూర్తి సంతృప్తితో ఉన్నామని ప్రకటనలో తెలిపింది. కొత్తగా వచ్చిన ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరైన రీతిలోనే పరిశీలించామని వెల్లడించింది.

