కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్‌కే కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం జిల్లాలోని సర్పంచులు (Sarpanches) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికైన సర్పంచులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు, అధికారాలు కల్పించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరారు.
అలాగే జిల్లాలోని సర్పంచులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆగస్టు 7న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి, నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధి, సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.

