కలం, నిర్మల్ రూరల్ : బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష తప్పదని నిర్మల్ (Nirmal) రూరల్ ఎస్సై లింబాద్రి హెచ్చరించారు. నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల్ గ్రామానికి చెందిన గండ్ల చిన్నయ్యను గతంలో ముందస్తు చర్యల్లో భాగంగా తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఆరు నెలల పాటు సత్ప్రవర్తనతో ఉండేందుకు భద్రతా పూచీకత్తు సమర్పించాలని నిర్మల్ తహసీల్దార్, కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ ఆదేశించినప్పటికీ, ఆయన పూచీకత్తు సమర్పించలేదన్నారు.
దీంతో చట్టప్రకారం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి జైలుకు పంపించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ముందస్తు చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

