కలం, నిర్మల్: బీసీ మహిళలకు ఆర్థికంగా చేయూతనందించి స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని(Sewing Machine Scheme) అమలు చేస్తోందని నిర్మల్(Nirmal) మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ సంక్షేమ శాఖ ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిందని, అర్హులైన మహిళలు సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకానికి బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలు అర్హులని తెలిపారు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, మేరా, మేరు కమ్యూనిటీలకు చెందిన మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షలకు మించకూడదని స్పష్టం చేశారు. దరఖాస్తుతో పాటు తెల్ల రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం కింద అవకాశం ఉంటుందని చెప్పారు. కుట్టు వృత్తిలో నైపుణ్యం ఉన్నవారితో పాటు కనీస ప్రాథమిక అక్షరాస్యత కలిగిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అర్హులైన మహిళలు tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ రవిబాబు సూచించారు.

