‘కరప్షన్ క్యాబినెట్’గా రేవంత్ సర్కార్: ఏలేటి

కలం, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదనే భయంతో ముఖ్యమంత్రి, మంత్రులు ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే(Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన, అభివృద్ధిని పక్కనపెట్టి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి, నలుగురు మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై క్యాబినెట్ సమావేశంలో మిగతా మంత్రులు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై చర్చ జరగకపోతే క్యాబినెట్ సమావేశాలు దోచుకున్న సొమ్ము పంపకాల కోసమే జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న కీలక శాఖలలో వసూళ్లు, కమిషన్లకు సంబంధించిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని రూ.7 కోట్లకే కేటాయించారనే మీడియా కథనాలపై రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ బిల్లుల క్లియరెన్స్‌కు 10 శాతం, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులకు 20 శాతం, మరికొన్ని బిల్లులకు 30 శాతం కమిషన్ అడుగుతున్నారనే ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని అన్నారు. అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ కంపెనీకి ఫీనిక్స్ సంస్థ నుంచి సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులు బదిలీ అయ్యాయనే ఆరోపణలపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

అవినీతి, కమిషన్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ధైర్యంగా ముందుకు వచ్చి ఏసీబీకి ఫిర్యాదు చేయాలని మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికార పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడాన్ని ద్వేషపూరిత ప్రసంగంగా చిత్రీకరించి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దోచిపెడుతోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణలపై కూడా సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గం ప్రజా సమస్యలు, అభివృద్ధి కంటే కమిషన్లు, వసూళ్లు, నోట్ల కట్టలపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. మంత్రివర్గం పూర్తిగా ‘కరప్షన్ క్యాబినెట్’గా (Corruption Cabinet) మారిందని ఆరోపించారు. మంత్రుల అవినీతి వ్యవహారాలను త్వరలో ఆధారాలతో బయటపెడతామని, అవినీతిపరులను బీజేపీ వదిలిపెట్టదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజు నరేష్‌తో పాటు బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, చిన్నయ్య, అర్జున్, ఈశ్వర్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>