కలం, స్పోర్ట్స్: జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ (Jamshedpur FC) యాజమాన్యంలో కీలక మార్పు జరిగింది. క్లబ్‌ను టాటా స్టీల్ (Tata Steel) విక్రయించేందుకు నిర్ణయించింది. గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు క్లబ్‌ను కేవలం రూ. 100కు అప్పగించనుంది. టాటా స్టీల్ కమిటీ ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. జంషెడ్‌పూర్ ఫుట్‌బాల్ అండ్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో టాటా స్టీల్ వద్ద ఉన్న మొత్తం 4.08 కోట్ల షేర్లను బదిలీ చేయనున్నారు. ఇందుకు టాటా స్టీల్, చర్చిల్ బ్రదర్స్ మధ్య షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా కుదిరింది.
అయితే ఈ ఒప్పందానికి కొన్ని అనుమతులు అవసరం. ముఖ్యంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అనుమతి రావాలి. అన్ని ప్రక్రియలు పూర్తయితే ఆగస్టు 31లోపు డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒప్పందంలో భాగంగా జంషెడ్‌పూర్ ఎఫ్‌సీకి ఉన్న ఐఎస్‌ఎల్ స్పోర్టింగ్ లైసెన్స్ కూడా చర్చిల్ బ్రదర్స్‌కు బదిలీ కానుంది. అలాగే జంషెడ్‌పూర్ ఎఫ్‌సీకి చెందిన 12 మంది ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌ల కాంట్రాక్టులను సెప్టెంబర్ 2026 నుంచి చర్చిల్ బ్రదర్స్ తీసుకోనుంది.
దీంతో వారు ఐఎస్‌ఎల్‌లో తమ కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయంతో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీపై టాటా స్టీల్ ప్రత్యక్ష యాజమాన్యానికి ముగింపు పడనుంది. అయితే ఫుట్‌బాల్‌కు టాటా స్టీల్ పూర్తిగా దూరం కానుంది. గ్రాస్‌రూట్, యువ ఫుట్‌బాల్‌పై దృష్టి కొనసాగించనుంది. ముఖ్యంగా స్థానిక, గిరిజన ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంపై ఫోకస్ పెట్టనుంది. జంషెడ్‌పూర్‌లో 1987లో ప్రారంభమైన టాటా ఫుట్‌బాల్ అకాడమీ ఇప్పటికే 300 మందికి పైగా క్యాడెట్లకు శిక్షణ ఇచ్చింది.
వారిలో సుమారు 150 మంది భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. చర్చిల్ బ్రదర్స్‌కు భారత ఫుట్‌బాల్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ జట్టు రెండు ఐ-లీగ్ టైటిళ్లు గెలిచింది. మొత్తంగా, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ యాజమాన్యం ఇప్పుడు టాటా స్టీల్ నుంచి చర్చిల్ బ్రదర్స్ చేతుల్లోకి వెళ్లనుంది. ఈ బదిలీ AIFF అనుమతులు, ఇతర ప్రక్రియలు పూర్తయిన తర్వాత అమల్లోకి రానుంది.

