నిర్మల్‌లో హిందూ యువ సమ్మేళనం

కలం, నిర్మల్: చదువు కేవలం వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ అవసరాలకే పరిమితం కాకుండా దేశానికి ఉపయోగపడేలా ఉండాలని సరస్వతీ విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. RSS శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం హిందూ యువ సమ్మేళనం(Hindu Yuva Sammelan) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేశవ్ హెగ్డేవర్ స్వాతంత్రానికి ముందే ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రారంభించారని గుర్తు చేశారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తోందన్నారు. యువత మొబైల్ ఫోన్లకు బానిసలై విలువైన జ్ఞానాన్ని కోల్పోవద్దని సూచించారు. మంచి విషయాలను తెలుసుకునేందుకు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం యువత ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన విధంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఉద్యోగాల కోసం ఎదురుచూడొద్దు

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా సంస్థలు స్థాపించి, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. యువతలో దేశభక్తి పెంపొందాలని, దేశం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భారత సైనికుడు భీమోల్ల అక్షయ్, జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, నగర సంఘచాలక్ డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, నగర కార్యవాహ కిన్నెర్ల రవి, శివకుమార్, బొద్దుల అశోక్, చుక్క సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>