కలం, నిర్మల్ : గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్టు పట్టణ సీఐ సమ్మయ్య తెలిపారు. శోభాయాత్ర జరిగే మార్గంలో వాహనాల రాకపోకలు, పార్కింగ్‌పై ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. నగరేశ్వరవాడ నుంచి బంగల్పేట్ వరకు శోభాయాత్ర జరిగే మార్గంలో ఎలాంటి వాహనాలను పార్కింగ్ చేయవద్దని సూచించారు.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే మయూరి హోటల్ పరిసర ప్రాంతాల్లో శోభాయాత్రను వీక్షించేందుకు వచ్చే ప్రజలు రోడ్డు పై వాహనాలను నిలపకుండా ఎన్టీఆర్ మినీ స్టేడియం సమీపంలోని సూచించిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను నిలపాలని కోరారు. గణేష్ నిమజ్జన (Ganesh Immersion) శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పోలీసులకు సహకరించాలని సీఐ సమ్మయ్య విజ్ఞప్తి చేశారు.

