కలం, నిర్మల్: వినాయక నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నాయంటే చాలు.. గణనాథుల సందడి మొదలవుతుంది. భారీ బొజ్జ గణపయ్యలను ముందుగానే బుక్ చేసుకునే పరిస్థితి నెలకొంటుంది. ఒకప్పుడు భారీ గణపతి ప్రతిమ (Ganesh Idols) ల కోసం నిర్మల్ వాసులే హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల ప్రజలే నిర్మల్ (Nirmal) కు వచ్చి గణనాథులను కొనుగోలు చేస్తున్నారు.
మంజులాపూర్‌లో గణపతి పరిశ్రమలు..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ప్రాంతం గణపతి విగ్రహాల (Ganesh Idols) తయారీకి ప్రత్యేక చిరునామాగా మారింది. ఇక్కడ పదుల సంఖ్యలో తయారీ కేంద్రాలు ఏర్పడి భారీ బొజ్జ గణపయ్యలను తీర్చిదిద్దుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణే ప్రాంతాల్లో ప్రతిష్ఠించే గణపతుల తరహాలో విభిన్న ఆకృతులు, అలంకరణలతో విగ్రహాలను రూపొందిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులు, కార్మికులను 10 నెలల ముందుగానే నిర్మల్‌కు రప్పించి ప్రత్యేక డిజైన్లతో గణనాథులను తయారు చేస్తున్నారు. దీంతో ప్రతిమల రూపకల్పనలో వైవిధ్యం కనిపిస్తూ కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నిర్మల్‌లో తయారవుతున్న గణనాథులకు పొరుగు ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్‌తో పాటు కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, కిన్వట్ ప్రాంతాల నుంచి సైతం నిర్మల్‌కు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన, ఆకర్షణీయమైన విగ్రహాలు లభిస్తుండటమే నిర్మల్‌కు పెరుగుతున్న గిరాకీకి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
హైదరాబాద్‌లో లభించే ధరతో పోలిస్తే నిర్మల్‌లో దాదాపు సగం ధరకే కొన్ని విగ్రహాలు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. నిర్మల్ పట్టణంలో సుమారు 3 వేల వరకు గణపతి ప్రతిమలను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటిలో 5 అడుగుల చిన్న విగ్రహాల నుంచి 25 అడుగుల భారీ గణనాథుల వరకు ఉన్నాయి. ఉత్సవాలకు నెల రోజుల ముందే అనేక విగ్రహాలు విక్రయమవుతున్నాయి.
సూరత్ నుంచి ప్రత్యేక అలంకరణలు
గణనాథుల అలంకరణలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి పట్టు పంచెలు, రంగురంగుల వస్త్రాలు, కండువాలు, మెరుపులు తెప్పించి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. దీంతో గణపతులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనం.. ముందే బుకింగ్
ఆకర్షణీయమైన రూపాల్లో గణనాథులను రూపొందించిన నిర్వాహకులు వాటి ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తున్నారు. విభిన్న ఆకృతులు, ప్రత్యేక అలంకరణలతో రూపొందించిన గణపతులను సోషల్ మీడియాలో చూసిన దూర ప్రాంతాల ప్రజలు నిర్మల్‌కు రాకముందే ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకుని ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో గణపతి ఉత్సవాలకు నెల రోజుల ముందే పలు విగ్రహాలకు డిమాండ్ ఏర్పడుతోంది.
కళాకారులకు ఉపాధి.. నిర్మల్‌కు ఖ్యాతి
గణపతి విగ్రహాల తయారీ కేంద్రాలతో స్థానికంగా వందలాది మంది కార్మికులు, కళాకారులకు ఉపాధి లభిస్తోంది. మహారాష్ట్రకు చెందిన కార్మికులకు సైతం సీజనల్‌గా జీవనోపాధి లభిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. వినాయక నవరాత్రులు ప్రారంభమైన తర్వాత ఇదే తయారీ కేంద్రాల్లో దుర్గామాత విగ్రహాల తయారీకి శ్రీకారం చుడతామని పేర్కొంటున్నారు. ఒకప్పుడు నిర్మల్ ప్రజలు గణనాథుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల ప్రజలే నిర్మల్‌కు తరలివస్తున్నారు. దీంతో గణపతి విగ్రహాల తయారీలో నిర్మల్ తనదైన ముద్ర వేస్తూ.. గణనాథుల తయారీకి కేరాఫ్‌గా నిలుస్తోంది.
Also Read : స్పీకర్, పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు!
Follow Us On: Instagram

