కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట్ కాలనీలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (Nirmal DLSA) ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన హక్కులపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్ మాట్లాడుతూ.. న్యాయ సేవాధికార చట్టం, అర్హులైన వారికి అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు.
డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనారోగ్య, సామాజిక పరిణామాలను వివరించడంతోపాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు సంబంధించిన చట్టాలు, వాటి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

