కలం, నిర్మల్ : అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ (Nirmal Literacy Rally) జిల్లా కేంద్రంలో పాఠశాల విద్యాశాఖ, వయోజన విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘నవ భారత సాక్షరతా కార్యక్రమం – ఉల్లాస్’ కింద “చదువుకుందాం రండి… చదువు నేర్పుదాం రండి” అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జుమ్మేరాత్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి గాంధీ చౌక్ మహాత్మా గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ కూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, అక్షరాస్యత ప్రాధాన్యతను తెలిపే ప్లకార్డులతో నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న మాట్లాడుతూ… అక్షరాస్యత అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కని పేర్కొన్నారు. 15 ఏళ్లు దాటిన ప్రతి నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్’ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని, జిల్లాలో 100% అక్షరాస్యత సాధనకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, గ్రామీణాభివృద్ధి శాఖ డిపిఎం శోభారాణి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

