భద్రాద్రి ఆకాశంలో విమానాల సందడి.. ఎయిర్‌పోర్ట్‌పై ఏఏఐ కసరత్తు

​కలం, ఖమ్మం బ్యూరో: దక్షిణ అయోధ్యగా, పారిశ్రామిక కేంద్రంగా భాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గగనతల అనుసంధానానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దశాబ్దాలుగా కేవలం కాగితాలకే పరిమితమైన విమానాశ్రయ ప్రతిపాదనలు ఇప్పుడు ఆచరణాత్మక రూపాన్ని సంతరించుకోవడంతో జిల్లా వ్యాప్తంగా సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కి చెందిన మల్టీ డిసిప్లినరీ సాంకేతిక బృందం రెండు రోజులుగా చేపడుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలతో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టు (Bhadradri Kothagudem Airport ) ఒక్కసారిగా ఊపందుకుంది. కేవలం చిన్నపాటి ప్రాంతీయ విమానాలకే పరిమితం కాకుండా, ఎయిర్‌బస్ A320, A321 వంటి భారీ ప్రయాణీకుల విమానాలు కూడా సునాయాసంగా దిగేలా 2,500 నుంచి 2,700 మీటర్ల సుదీర్ఘమైన రన్‌వే ఏర్పాటుపై ఏఏఐ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.

​ఈ సర్వే ప్రక్రియలో భాగంగా మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో సాంకేతిక బృందం చేపట్టిన క్షేత్రస్థాయి తనిఖీలను జిల్లా కలెక్టర్ అంకిత్ నేరుగా పర్యవేక్షించారు. భరత్ రెడ్డి నేతృత్వంలోని ఏఏఐ బృందం సుజాతానగర్ మండలం లోని సీతంపేట, సుజాతానగర్, దుమ్ముగూడెం, ములకలపల్లి చాపరాలపల్లి, తిమ్మంపేట దమ్మపేట, మరియు చుంచుపల్లి (పెనగడప) ప్రాంతాలలో భూమి స్వభావాన్ని పరిశీలించింది. ప్రాథమిక మ్యాప్‌ల ఆధారంగా గుర్తించిన 500 ఎకరాల విస్తీర్ణంతో పాటు విమానాలు సురక్షితంగా దిగి లేచే ‘అప్రోచ్ ఫన్నెల్’ కోసం అదనంగా మరో 1.5 కిలోమీటర్ల స్థలం అవసరమయ్యే అవకాశాలను సాంకేతిక నిపుణులు విశ్లేషించారు.

​ఈ రెండు రోజుల సర్వేలో ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్న 10 నుంచి 15 మీటర్ల ఎత్తు గల చిన్న కొండలు, మట్టి మడుల తొలగింపు సాధ్యాసాధ్యాలను అంచనా వేయడంతో పాటు, రన్‌వే కింద నీటి ప్రవాహ మార్గాలు, నల్లరేగడి మట్టి స్వభావం, అటవీ భూముల పర్యావరణ అనుమతులపై ఏఏఐ బృందం నిశిత అధ్యయనం జరిపింది. ముఖ్యంగా దుమ్ముగూడెం ప్రాంతంలో రహదారి సౌకర్యాలు ఇరుకుగా ఉన్నప్పటికీ భౌగోళికంగా అనుకూలంగా ఉండటం, సత్తుపల్లి గూడ్స్ రైల్వే లైన్ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రభావాలను తట్టుకునేలా ‘షీల్డింగ్’ విధానాన్ని పరిశీలించడం వంటి ముఖ్యాంశాలను ఏఏఐ సభ్యులు కలెక్టర్ అంకిత్‌కు క్షుణ్ణంగా వివరించారు.

​ఈ భారీ విమానాశ్రయ కల సాకారమైతే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు రవాణా మార్గం సులువవ్వడంతో పాటు, సింగరేణి, కేటీపీఎస్ వంటి భారీ సంస్థలకు విదేశీ పెట్టుబడులు, వ్యాపార ప్రతినిధుల రాకపోకలు విపరీతంగా పెరుగుతాయి. ఇది తెలంగాణ సరిహద్దుల్లోని ఏపీ గోదావరి జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు కూడా ప్రధాన వైమానిక కేంద్రంగా రూపాంతరం చెందనుంది.​ప్రస్తుతం సేకరించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని గత 10 నుంచి 40 సంవత్సరాల వర్షపాతం, గాలి వేగం-దిశల డేటాతో అనుసంధానించి సాఫ్ట్‌వేర్ ఆధారిత సిమ్యులేషన్ నిర్వహిస్తారు. రాబోయే 6 నుంచి 8 వారాల్లో ఏఏఐ పూర్తిస్థాయి ‘టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్’ను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక, పర్యావరణ అనుమతులు, భవిష్యత్ కనెక్టివిటీ ఆధారంగానే భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ తుది స్థలాన్ని అధికారికంగా ఖరారు చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>