సర్పంచ్‌గా ప్రజాసేవ.. పీహెచ్‌డీతో లాల్‌సింగ్‌ సత్తా

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రజలకు సేవలందిస్తూనే ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్‌డీ డాక్టరేట్ సాధించిన నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారేగాం తండా (Karegaon Tanda) గ్రామ సర్పంచ్ డాక్టర్ రమావత్ లాల్‌సింగ్‌కు (Dr Ramavath Lalsingh) అరుదైన గౌరవం దక్కింది. సర్పంచ్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించడం ద్వారా ఆయన యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో “సమకాలీన హిందీ ఉపన్యాస్ మే సాంప్రదాయిక్ సంఘర్ష్” అనే అంశంపై డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో ఆయనకు పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు.

విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, భారతీయ బయోటెక్నాలజీ చైర్మన్ డాక్టర్ కృష్ణ మిలా, వీసీ మొగలయ్య చేతుల మీదుగా డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు. ఒకవైపు గ్రామ సర్పంచ్‌గా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, గ్రామ అభివృద్ధికి పాటుపడుతూనే మరోవైపు ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్‌డీ సాధించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.

సర్పంచ్ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఉన్నత విద్యలోనూ రాణించి డాక్టరేట్ సాధించడం ద్వారా ఆయన యువతకు ఆదర్శంగా నిలిచారని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ మాట్లాడుతూ.. తన పరిశోధనకు సహకరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో విద్యా రంగంతో పాటు ప్రజాసేవలోనూ మరింతగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>