కలం, నిర్మల్: ఖరీఫ్ సీజన్‌కు ఊపిరిగా నిలవాల్సిన వర్షాలు ముఖం చాటేయడంతో నిర్మల్ (Nirmal ) జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌లో కురిసిన చిరుజల్లులతో ఆశలు చిగురించిన రైతులు వరి నారుమడులు పోసి, పంటల సాగు ప్రారంభించారు. కానీ గత పక్షం రోజులుగా వర్షం కురవకపోవడంతో నారుమడులు ఎండిపోతుండగా, వేసిన విత్తనాలు చాలాచోట్ల మొలకెత్తలేదు. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు నారును కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లు మోస్తూ అవస్థలు పడుతున్నారు.
జిల్లాలోని పలు మండలాల్లో వరి, మిర్చి, పత్తి తదితర పంటల సాగు దెబ్బతింటోంది. భూమిలో తగినంత తేమ లేక విత్తనాలు మొలకెత్తని పరిస్థితి ఒకవైపు, మొలక వచ్చిన నారు ఎండిపోవడం మరోవైపు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ఉదయం, సాయంత్రం బోర్లు, బావుల నుంచి బిందెలతో నీరు తెచ్చి నారుమడులపై పోస్తూ రైతులు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎకరాకు వేల రూపాయలు ఖర్చు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు వర్షాభావం పెద్ద దెబ్బగా మారింది. మళ్లీ నారు వేయాల్సి వస్తే అదనపు భారం తప్పదని రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి సాగు ప్రారంభించిన వారికి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. జూన్ నెలలో సాధారణంగా 173 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 101 మిల్లీమీటర్లు నమోదైంది. అయితే అవి అడపాదడపా కురిసిన వర్షాలే కావడంతో చెరువులు, వాగులు, బావుల్లో నీటి నిల్వలు పెరగలేదు. జూలైలో ఇప్పటివరకు 204 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. జిల్లాలోని పెంబి, బైంసా, కుంటాల మండలాల్లో మాత్రమే మోస్తారు వర్షాలు కురిసాయి. మిగితా మండలాల్లో వర్షాలు లేక భూగర్భ జలాలు పెరగకపోవడంతో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది.
వెలవెలబోతున్న ప్రాజెక్టులు
ఉత్తర తెలంగాణ రైతులకు ప్రధాన ఆధారమైన శ్రీరాంసాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ), స్వర్ణ, కడెం ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో వరద నీరు చేరడం లేదు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 1064. 30 అడుగుల నీటిమట్టంతో సుమారు 15 టీఎంసీలు, స్వర్ణ ప్రాజెక్ట్ లో 0.167 టీఎంసీలు, కడెం జలాశయంలో 0.466 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. భారీ వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులకు కొత్త నీటి ప్రవాహం లేక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకుంటున్నా చినుకులు మాత్రం కురవడం లేదు. ప్రతి రోజు వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు “ఈరోజైనా వాన పడుతుందేమో” అనే ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. మరో వారం రోజుల్లోనైనా మంచి వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

