కలం, నిర్మల్: శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని నటరాజ్‌నగర్ శ్రీ ఉమామహేశ్వర ఆలయం నుంచి దిలావర్పూర్ మండలం కదిలి (Kadili) గ్రామంలోని శ్రీ మాతన్నపూర్ణ పాపహరేశ్వర ఆలయం వరకు భక్తుల పాదయాత్ర (Devotees Padayatra) భక్తిశ్రద్ధలతో చేపట్టారు. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. లోకకళ్యాణార్థం వరుసగా పదోసారి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకొని భక్తిమార్గంలో నడవాలని కోరారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీ గండిరామన్న దత్త సాయి ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి నరహరి, సాయి దీక్ష సేవా సమితి సభ్యులు, శివభక్తులు పాల్గొన్నారు.

