బౌరంపేట్‌లో దారుణం.. ఆగి ఉన్న కారులో వ్యక్తి సజీవ దహనం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ శివారులోని బౌరంపేట్‌(Bowrampet)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆగి ఉన్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్న రాధాకృష్ణ (40) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే దుండిగల్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం కారును పరిశీలించిన పోలీసులు అందులో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమికంగా ఈ ఘటన ఆత్మహత్యగా జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదవశాత్తూ కారులో మంటలు చెలరేగాయా? లేక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికుల సమాచారం ప్రకారం.. రాధాకృష్ణ బౌరంపేట్‌లోని ఓ విల్లాలో నివసించేవాడని తెలుస్తోంది. కుటుంబ సమస్యల కారణంగా కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు రాధాకృష్ణ ఎక్కడికి వెళ్లాడు? కారులో మంటలు ఎలా చెలరేగాయి? మంటలు ప్రారంభమైన సమయంలో కారులో మరెవరైనా ఉన్నారా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఘటనాస్థలానికి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలించే అవకాశం ఉంది. మృతుడి కుటుంబ సభ్యులు సన్నిహితులను కూడా పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్య నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలను నిర్ధారించనున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>