కలం, నేషనల్ డెస్క్: చనిపోయాడనుకున్న సోదరుడు 35 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కండ్ల ముందు సాక్షాత్కరించిన ఘటన హర్యాణా (Haryana) రాష్ట్రంలో చోటు చేసుకుంది. జింద్ జిల్లా మనోహర్పూర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ల సరిచూసే ప్రక్రియ జరుగుతోంది. పంజాబ్‌లో నివసిస్తున్న సీతా రామ్ అనే వ్యక్తి తన పాత స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎల్సీ) కోసం ఈ బడికి వచ్చారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) కృష్ణ కుమార్ వివరాలు ఆరా తీస్తూ.. అతడి గ్రామం, తండ్రి, సోదరుడి పేరు అడిగారు.
పాఠశాలలో కన్నీటి పర్యంతం..
సీతా రామ్ తన తమ్ముడి పేరు బల్బీర్ అని చెప్పడంతో, బీఎల్వో కృష్ణ కుమార్ వెరిఫికేషన్ కోసం వెంటనే బల్బీర్కు ఫోన్ చేశారు. అవతలి నుంచి సీతా రామ్ పేరు వినగానే బల్బీర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘ఆయన నా అన్నయ్యే! 35 ఏళ్లుగా ఆయన కోసం వెతుకుతున్నాం’ అని చెబుతూ పాఠశాలకు చేరుకున్నారు. బడికి చేరుకున్న బల్బీర్ అన్న సీతా రామ్‌ను చూడగానే కౌగిలించుకుని బోరున విలపించాడు.
35 ఏళ్ల తర్వాత సోదరులిద్దరు కలుసుకున్న తీరును చూసి అక్కడున్న ప్రభుత్వ అధికారులు, స్థానికులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్నాళ్లూ సోదరుడు చనిపోయి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. అయితే, సీతా రామ్ పంజాబ్‌లోనే ఉంటూ ఒక ప్రైవేట్ పాఠశాలలో అటెండర్‌గా, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించినట్లు తేలింది.

