కలం, నిర్మల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ‘స్వచ్ఛతా హి సేవ – 2026’ (Swachhata Hi Seva–2026) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవి బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి మున్సిపల్ చెత్త సేకరణ వాహనానికి అందించాలని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పరిశుభ్రమైన వాతావరణంతో ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెనిగారపు నరేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

